గ్రామాలను కాపాడుకోవాలి

కరోనా నుంచి గ్రామాలను కాపాడుకునే బాధ్యత సర్పంచులదేనని, ప్రతిమ ఫౌండేషన్‌ అందిస్తున్న ఉచిత మాస్కులను ఆయా వర్గాలకు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సూచించారు. ప్రస్తుతం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, నిర్వాహకులు మాస్కులు ధరించడం వల్ల కరోనా నుంచే కాకుండా దుమ్మూ ధూళి నుంచి కూడా రక్షణ పొందవచ్చవని చెప్పారు. వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, లాక్‌డౌన్‌లో ప్రజల భాగస్వామ్యం బాగుందని ప్రశంసించారు. వైద్య, పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కరీంనగర్‌ రూరల్‌ నగునూర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, సుల్తానాబాద్‌, బోయినపల్లి మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు మాస్కులను అందించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కోటి మాస్కులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతిమ ఫౌండేషన్‌ను, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి శ్రీనివాస్‌ను అభినందించారు. పట్టణ ప్రాంతాల్లో మాస్కులు విరివిగా లభిస్తున్నాయని, గ్రామీణులకు కూడా వీటిని అందించి వైరస్‌ను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు.