‘చల్ తీయ్. మీ దొరింటికి నేనేమిటికి వొచ్చుడు?’ అంది భూమి తలెగరేసి.‘గట్లనమాకె. నిన్నుదెస్తనని దొరసానికి జెప్పిన. నా ఇజ్జత్ బోతది’ అన్నడు. సదువుకున్న పెండ్లాన్ని పనికి తోల్కెల్లుడు ఆనికీ ఇస్టం లేకున్నా, దొరసాని మాట గాదన్లేక బూమిని బతిమాలిండు. ఒక్కదినమే అంటుండుగన్క మగన్ని తక్లీఫుల బెట్టుడు ఏమిటికని ‘సరే వొక్కదినమేగద. వొస్తలే’ అంది.ఐతే ఒక్కదినంతో సరిపోలే. వారం రోజులు ఎల్లాల్సొచ్చింది బూమికి. ఇంద్ర బవనంల రంబ లెక్క, తన ఇంట్ల తిరుగుతున్న బూమిని జూసిన దొర గుండె జారిపోయింది. ‘పన్జేసేటోనికి ఇంత సక్కని సుక్క పెండ్లామా’ అని సలమల అయ్యిండు.ఒకరోజు అర్ర ఊకుతుండగ ఎనక్కెల్లి ఎవరో గట్టిగ బట్టినైట్టె, గిర్రున ఎనక్కి దిరిగింది బూమి. ఎనకనే దొర ఉండుడు జూసి ‘గిదేంది దొర. నేను పనిమనిసిని’ అంది. ‘తెల్సే. అందుకే బట్టిన. పిల్లల తల్లి లెక్క లేవు నువ్' అన్నడు రాంభూపాల్.‘తప్పు దొర. మేం అసుంటోల్లంగాదు. పన్జేసుకు బతికెటోల్లం’ అంది దూరంగబోతూ.ఆయ్న ఆమె పైటబట్టి ‘బెడ్రూముల మాలాంటి దొరలతాన గసుంటి ఎక్వతక్వలుండవ్. నీకు మస్తు ఇనాములిస్త. ఒక్కపాలి రా’ అని జబర్దస్తీగ దగ్గరికి లాగిండామెని. గా లాగుడికి ఆయ్న చాతీ మీదికి బడ్డ బూమి, జర తమాయించుకుని, లాగి ఆయ్న చెంపమీద సాచి కొట్టింది. గంతే... ఆమె సేతుల్ల ఎంత బలముందో తెల్వదుగానీ, ఆయ్న కండ్లముందు ఒక్కతూరి సుక్కలు గనిపించినై. ఆమె మర్లబడి తన సెంపమీద గంత గట్టిగ కొడ్తదని ఆయ్న ఊహించలే. ఆయన్ని కొట్టినంక, ఆడికెల్లి బిరాన ఉర్కుకుంట వొచ్చి తన ఇంట్ల బడింది.