దేశరాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మానసిన ఉల్లాసం కోసం నిర్వహిస్తున్న ‘సంతోషకర తరగతులు (హ్యాపీ క్లాసెస్)’ స్ఫూర్తిదాయకమని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తెలిపారు. తన భర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి సోమవారం భారత పర్యటనకు వచ్చిన ఆమె, మంగళవారం దక్షిణ ఢిల్లీ మోతీ బాగ్‌లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మెలానియా రాకపట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ చేతుల్లోని భారతీయ, అమెరికా జెండాలను రెపరెపలాడించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు విద్యార్థినులు మెలానియా నుదుట తిలకం దిద్ది, పుష్పగుత్తి ఇచ్చి బ్యాండుమేళంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసిన ఆమె, పాఠశాలలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘సంతోషకర తరగతుల’ తీరును పరిశీలించారు. ‘అమెరికా ఎంత పెద్దది? చాలా దూరమా? ప్రథమ మహిళగా మీరు ఏం చేస్తారు?’ అంటూ బాలలు అడిగిన చిలిపి ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానమిచ్చారు. అనంతరం విద్యార్థునుద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. భారత్‌లో ఇది నా తొలి పర్యటన. ఇక్కడి ప్రజలు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రకృతితో మమేకమవుతూ విద్యార్థులు తమ దినచర్యను ప్రారంభించడం చాలా స్ఫూర్తిదాయకం. సానుకూల దృక్పథంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దడం హర్షనీయం’ అని మెలానియా ప్రశంసించారు.
‘హ్యాపీ క్లాసెస్' స్ఫూర్తిదాయకం